రజనీకాంత్‌ పార్టీ...ఓపెనింగ్ బాగుంది కానీ...

March 12, 2020


img

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ గురువారం ఉదయం చెన్నైలో ఒక ప్రముఖ హోటల్లో తాను స్థాపించబోయే రజనీ మక్కల్ మండ్రమ్ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం చాలా అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా ఉంది. ప్రతీసారిలాగ తన రాజకీయ ప్రవేశం గురించి నాన్చకుండా ఈసారి చాలా స్పష్టంగా చెప్పారు. 

2021లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్‌ స్పష్టంగా ప్రకటించారు. కనుక ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్దం చేస్తానని రజనీకాంత్‌ చెప్పారు. నిజానికి తనవంటి వయసు మళ్లినవారు రాజకీయాలలో ప్రవేశించనవసరం లేదని, రాజకీయాలలో కూడా వయోపరిమితి ఉండాలని కోరుకొంటున్నానని రజనీ అన్నారు. కానీ రాష్ట్రంలో పరిస్థితులను చూసిన తరువాత వ్యవస్థలో మార్పు తీసుకురావడం చాలా అవసరమని భావించి తాను రాజకీయ ప్రవేశం చేయవలసివస్తోందని చెప్పారు. తాను పదవుల కోసం రాజకీయాలలోకి రావడం లేదని కనుక ఒకవేళ ఎన్నికలలో తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టబోనని రజనీకాంత్‌ చెప్పారు. తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రంలో ఓ మంచి వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని రజనీ చెప్పారు. అది విని మండ్రమ్ కార్యదర్శులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన  అభిమానులు షాక్ అయ్యారు. తన పార్టీలో అధికశాతం పదవులు విద్యావంతులైన యువతకు, మంచి అనుభవం కలిగిన ఐఏస్‌, ఐపిస్‌లకు ప్రాధాన్యం కల్పిస్తానని చెప్పారు. వారిలో అత్యంత ప్రజాభిమానం పొందిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని రజనీ చెప్పారు. 

ఇప్పటివరకు డీఎంకె, అన్నాడీఎంకె పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంక్ 30 శాతం ఉండగా, దివంగత ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితలను చూసి ఓటు వేసేవారు 70 శాతం ఉండేవారని, కానీ ఇప్పుడు వారిద్దరూ లేరు కనుక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీకి అవకాశం ఏర్పడిందని అన్నారు. 

రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్టడమే తన ఏకైక లక్ష్యమని, పదవులు అధికారానికి తాను దూరంగా ఉంటానని రజనీకాంత్‌ అన్నారు. నిజానికి ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి రాజకీయ ఆలోచనలే ఇప్పుడు దేశానికి చాలా అవసరం. కానీ ఎన్నికల ఫలితాలను డబ్బు, మద్యం, కులమతాలు, సెంటిమెంట్లు శాశిస్తున్నాయిప్పుడు. ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిస్తే తప్ప ప్రభుత్వాలు మనుగడ సాగించలేని ‘పవర్ పాలిటిక్స్’ ‘డర్టీ పాలిటిక్స్’ ప్రస్తుతం మన కళ్లెదుటే సాగుతున్నాయి. 

కనుక ఇటువంటి అవకరమైన రాజకీయ వ్యవస్థను...దానికి బాగా అలవాటుపడిపోయిన ప్రజల ఆలోచనలను రజనీకాంత్‌ మార్చగలరా?మార్చగలిగితే ఆయన రియల్ లైఫ్ లో కూడా హీరోయే అవుతారు. 


Related Post