తెలంగాణలో గలగల ప్రవహిస్తున్న గోదావరి

March 12, 2020


img

గలగల ప్రవహిస్తున్న గోదావరి...గలగల పారుతున్న గోదారిలా...వంటి పాటలు విన్నప్పుడు అవి ఆంధ్రాకు సంబందించినవిగా అనిపించేవి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా గోదావరి గలగల ప్రవహిస్తుండటంతో తెలంగాణలో కూడా గోదావరి పాటలు పాడుకునే సమయం వచ్చేసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో పదో ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో తిప్పాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బాహుబలి మోటర్లలో మొదటి మోటారును ప్రాజెక్టు ఉన్నతాధికారులు బుదవారం మధ్యాహ్నం ఆన్‌ చేసి విజయవంతంగా వెట్-ట్రయల్ రన్ నిర్వహించారు. 

ఆసియాలో కెల్లా అతిపెద్ద భూగర్బ సర్జ్‌పూల్‌లో ఏర్పాటు చేసిన మూడు భారీ మోటర్లలో ఒకటి ఆన్‌ చేయగానే గోదావరి జలాలు ఉరకలేస్తూ అనంతగిరి జలాశయంలోకి ప్రవహించాయి. అది చూసి కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ఇంజనీర్లు, కార్మికులు, స్థానిక ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. 

సర్జ్‌పూల్‌లో ఏర్పాటు చేసిన ఒక్కో మోటార్ 106 మెగావాట్స్ సామర్ధ్యం కలిగి ఉంది. ఒక్కో మోటారుతో రోజుకు 11,200 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తిపోయగలవు. బుదవారం మధ్యాహ్నం ఆన్‌ చేసిన మొదటి మోటర్‌ గురువారం మధ్యాహ్నం వరకు ఆగకుండా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. అంటే అదొక్కటే ఇప్పటివరకు 11,200 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తిపోసిందన్న మాట! త్వరలోనే మిగిలిన రెండు మోటర్లను కూడా ఆన్‌ చేసి వెట్-రన్ పరీక్ష నిర్వహించనున్నారు. మూడు ఒకేసారి పనిచేయడం మొదలుపెడితే రోజుకు 33,600 క్యూసెక్కుల నీళ్ళు అన్నపూర్ణ రిజర్వాయరులోకి ఎత్తిపోస్తాయి కనుక రిజర్వాయరులో ఒక టీఎంసీ నీళ్ళు నిలువవుతాయి. దాంతో 11వ ప్యాకేజీ కింద ఉండే హెడ్ రెగ్యులేటర్లకు నీళ్ళు చేరుతాయి.   


మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయరుకు అక్కడి నుంచి రంగనాయక్ సాగర్‌, మల్లన్న సాగర్,  కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీళ్ళు చేరుతాయి. కనుక ఇంతవరకు వర్షాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులకు ఇకపై ఏడాది పొడవునా నీళ్ళు అందుబాటులో ఉంటాయి కనుక ఇక ఏడాదికి మూడు పంటలు పండించవచ్చు. 


Related Post