జగిత్యాలవాసి లింగన్న అరెస్ట్.. కశ్మీర్‌ తరలింపు

March 12, 2020


img

జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్‌ గ్రామానికి చెందిన సరికెల లింగన్న (35)ను కశ్మీర్‌ పోలీసులు బుదవారం రాత్రి అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మెట్‌పల్లి కోర్టు అనుమతితో కశ్మీర్‌కు తీసుకుపోయారు. 

కశ్మీర్‌లో అర్నియా అనే ప్రాంతంలో గల ఓ ఆర్మీక్యాంపులో రాకేశ్ కుమార్ అనే వ్యక్తి కూలిగా పనిచేస్తున్నాడు. అతను ఓ మహిళా పాకిస్తాన్ గూడఛారి ఉచ్చులో చిక్కుకొన్న తను పనిచేస్తున్న సైనిక స్థావరానికి సంబందించి కొన్ని రహస్యాలను ఆమెకు చెప్పినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. దాంతో కశ్మీర్‌ పోలీసులు అతనిని ఈ ఏడాది జనవరి 5న అరెస్ట్ చేశారు. అతనికి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా సరికెల లింగన్న బ్యాంక్ అకౌంట్ నుంచి అతనికి ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి 13న రూ.5,000 మళ్ళీ ఫిబ్రవరి 25న రూ.4,000 నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. 

గూడచర్యానికి పాల్పడుతున్న రాకేశ్ కుమార్‌కు లింగన్న ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు అనుమానిస్తున్న కశ్మీర్‌ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి తమతో తీసుకు వెళ్ళేందుకు ఈనెల 4వ తేదీన కుస్తాపూర్ వచ్చారు. కానీ అప్పుడు వారు ట్రాన్సిస్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకురాకపోవడంతో మెట్‌పల్లి కోర్టు లింగన్నను అరెస్ట్ చేయడానికి అనుమతించలేదు. కనుక అప్పుడు వారు వెనుతిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ వారెంటుతో రావడంతో మెట్‌పల్లి కోర్టు లింగన్నను అరెస్ట్ చేసి కశ్మీర్‌ తీసుకు వెళ్ళేందుకు అనుమతించింది. ఈరోజు ఉదయం ఆరు లింగన్నను తీసుకొని కశ్మీర్‌ తిరుగుప్రయాణమయ్యారు.


Related Post