కాంగ్రెస్‌కు సింధియా షాక్...సింధియాకు ఎమ్మెల్యేలు షాక్!

March 12, 2020


img

మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడిన జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో చేరి రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కల్పించారు. బిజెపిలో చేరగానే రాజ్యసభలో సీటు సంపాదించుకున్నారు కూడా. కానీ ఆయన అనుకొన్నది ఒకటి జరిగింది మరొకటి. 

ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీని నుంచి బయటకు వచ్చిన 19 మంది ఎమ్మెల్యేలు, ఆయన నేతృత్వంలో బిజెపి మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ సింధియా బిజెపిలో చేరి రాజ్యసభ సీటు దక్కించుకోవడంతో ఆయనను నమ్ముకొని బయటకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. 

వారి పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ వారు తిరిగివస్తే మంత్రిపదవులు ఇస్తామని చెపుతుండటంతో వారిలో 13 మంది మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోబోతున్నారని సమాచారం. సింధియా వెంట కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన మంత్రి ప్రియవ్రత్ సింగ్ భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సింధియాజీపై నమ్మకం, గౌరవంతో మేమందరం బయటకు వచ్చాము. ఆయనను రాజ్యసభకు పంపించాలని మేము భావించాము. కానీ దాని కోసం ఆయన బిజెపిలో చేరిపోతారని ఊహించలేకపోయాము. ఆయన బిజెపిలో చేరినప్పటికీ మేము మాత్రం బిజెపిలోకి వెళ్లాలనుకోవడం లేదు. కనుక మా భవిష్య కార్యాచరణపై చర్చించుకొని నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు. 

తిరుగుబాటు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఊగిసలాటలో ఉండటంతో వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ గట్టిగా ప్రయాత్నిస్తున్నాయి. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రెండు పార్టీలు వారిని తాము అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రాలకు తరలించాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించగా, బిజెపి తన ఎమ్మెల్యేలను హర్యానాలోని గురుగావ్‌కు తరలించింది. కనుక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం నిలబడుతుందో లేదో త్వరలోనే తేలిపోనుంది.


Related Post