వివేకా హత్య కేసు సిబిఐకి!

March 12, 2020


img

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దారుణంగా హత్య చేయబడిన సంగతి అందరికీ తెలుసు. కానీ అంత దారుణంగా ఆయనను ఎవరు హత్య చేశారో..ఎందుకు చేశారో ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. ఆయన స్వయాన్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి బాబాయ్ అయినప్పటికీ ఆ కేసు విచారణలో పురోగతిలేకపోవడం ఇంకా విచిత్రం. కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తదితరులు వేసిన వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు బుదవారం తీర్పు వెలువరించింది. ఈ కేసును సిట్ బృందం సమర్ధంగా దర్యాప్తు చేస్తోందనే ప్రభుత్వ వాదనలను హైకోర్టు ఆక్షేపించింది. ఈ కేసుకు సంబందించి సిట్ నివేదికను రెండు సీల్డ్ కవర్లలో హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో టిడిపి, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఆయన హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గానీ ఆయనను ఎవరు ఎందుకు హత్య చేశారో కనుగొనలేకపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఈ రాజకీయ హత్య మిస్టరీని కనీసం సిబిఐ అయినా చేదిస్తుందో లేదో చూడాలి.


Related Post