రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యాచారాల కేసు హైకోర్టుకు చేరింది. ఆ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన తరువాత నిబందనల ప్రకారం అతనికి ఉరిశిక్షను ఖరారు చేయవలసిందిగా హైకోర్టును కోరింది.
రిఫరల్ ట్రయల్‌గా పేర్కొనబడే ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఛార్జ్ షీటును దాఖలు చేసిన నల్గొండ పోలీసులకు, దోషి శ్రీనివాస్ రెడ్డిని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
మరోపక్క శ్రీనివాస్ రెడ్డి ఫాస్ట్-ట్రాక్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. కనుక దానిపై కూడా హైకోర్టులో వేరేగా విచారణ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు విచారణలో కూడా అతను దోషిగా తేలినట్లయితే ఉరిశిక్షను ఖరారు చేయవచ్చు లేదా శిక్షను మార్పు చేయవచ్చు.
మళ్ళీ దానిపై కూడా దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కనుక ఈ తతంగం అంతా పూర్తవడానికి కనీసం మరో 7-8 నెలలు పడుతుందేమో?ఒకవేళ శ్రీనివాస్ రెడ్డికి కూడా నిర్భయ దోషుల తరపు వాదిస్తూ వారికి ఉరిశిక్ష పడకుండా కాపాడుకొస్తున్న ఏపీ సింగ్ వంటి న్యాయవాదిని పెట్టుకోగలిగితే కనీసం మరో 7-8 ఏళ్ళు ఈ కేసును నడిపించే అవకాశం కూడా ఉందని భావించవచ్చు.