ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదా టిడిపికి ప్రత్యామ్నాయం ఏదని ప్రశ్నిస్తే, ఇప్పుడు టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఏదని ప్రశ్నించుకొనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపిలు రెండూ టిఆర్ఎస్ కి మేమే ప్రత్యామ్నాయం అంటే కాదు మేమని పోరాడుకొంటున్నాయి. ఓటుకి నోటు కేసులో చిక్కుకొని ఉండకపోయుంటే టిడిపి కూడా వాటితో పోటీ పడుతుండేదేమో? ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్ పార్టీయే చాలా గట్టిగా టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడుతోంది. పార్టీ ఫిరాయింపుల కారణంగా పూర్తిగా దెబ్బతిందనుకొన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంత త్వరగా లేచి నిలబడి తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా ఢీ కొనడం గొప్ప విషయమే.
బిజెపికి ఫిరాయింపుల బెడద లేదు...పైగా కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తెలంగాణలో బిజెపి గొంతు గట్టిగా వినబడటం లేదనే చెప్పుకోవచ్చు. బహుశః మున్ముందు ఏదో ఒకరోజు తమతో టిఆర్ఎస్ తో పొత్తులకి అంగీకరిస్తుందనే ఆశతోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల బిజెపి కొంచెం మెతక వైఖరి ప్రదర్శిస్తోందేమో? రాష్ట్ర బిజెపి నేతలు నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పనులలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే, భాజపా అధ్యక్షుడు అమిత్ షా మొదలు కేంద్రమంత్రులు వరకు చాలా మంది ముఖ్యమంత్రి కెసిఆర్ ని, ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని తెగపొగుడుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈనెల 7న వస్తున్నారు.
బిజెపిలో ఈ ఉన్న అయోమయం కారణంగానే అది టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నట్లుంది. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా టిఆర్ఎస్ తో జత కట్టాలని ఉన్నప్పటికీ గతంలో ఒకసారి అది హ్యాండ్ ఇవ్వడం వల్ల మళ్ళీ అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయకుండా స్వంతంగా మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రయత్నాలు కొంచెం ఫలిస్తున్నట్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మిగిలిన రెండున్నరేళ్ళు కూడా ఇదే దూకుడు కొనసాగించగలిగితే, రాష్ట్రంలో టిఆర్ఎస్ కి అదే ప్రత్యామ్నాయం అవుతుంది.