25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. ముహూర్తం: జూన్ 5

May 08, 2024


img

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీయే అని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. 

నేడు హైదరాబాద్‌లో మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, “కేసీఆర్‌కి అధికారం లేకపోతే నీళ్ళలో నుంచి బయటపడిన చేపలా కొట్టుకుంటారని ఆయన మాటలతోనే అర్దమవుతోంది. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఏవిదంగా కూల్చేయాలా అని కేసీఆర్‌ ఆలోచనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏదో విదంగా కూల్చేసి అధికారంలోకి రావాలని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు. 

నాకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో బాధపడుతున్నానని ఆయనే ఊహించేసుకుంటూ, మా ప్రభుత్వాన్ని నేనే కూల్చేసుకొని ఆయన పంచన చేరుతానని కలగంటున్నారు. కానీ నాకు పదవులపై అంత దురాశ లేదు. రేవంత్‌ రెడ్డి మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయనకు అండగా మేమందరం నిలబడి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కుంటాము. 

కేసీఆర్‌ మా ప్రభుత్వాన్ని కూలద్రోయడం కాదు. జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడే 25 మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్‌ తరపున పోటీ చేస్తున్న ఆరుగురు ఎంపీ అభ్యర్ధులు మాతో టచ్‌లో ఉన్నారు. కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్‌ దుకాణం బంద్ కాబోతోంది,” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


Related Post