రైతు భరోసా ఆపింది... ఇస్తానంటున్నదీ కాంగ్రెసే: రావుల

May 08, 2024


img

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకోవడంతో మూడు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్స్ మొదలుపెట్టాయి. బిఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రైతు భరోసా ఆపింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇప్పుడు ఇస్తానంటున్నదీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. మా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు భరోసా ఆపించేసిందని దుష్ప్రచారం చేయడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా డ్రామా ఆడింది. కానీ రైతు భరోసా నిలపాలని మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనే లేదని గ్రహించి ఇప్పుడు ఎన్నికల సంఘమే నిలిపి వేయించిందని అబద్దాలు చెపుతున్నారు. 

దాని గురించి సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు చేసిన ప్రకటనల వల్లనే ఎన్నికల సంఘం మే 14వరకు రైతు భరోసా నిధులు విడుదలని ఆపింది తప్ప ఎవరో ఫిర్యాదు చేసినందుకు కాదు. రైతుల సంక్షేమం కోసమే కేసీఆర్‌ రైతు బంధు పధకాన్ని ప్రవేశపెట్టి టంచనుగా చెల్లించేవారు. 

కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి రైతుల సంక్షేమం కంటే ఎన్నికలే ముఖ్యం అనుకుంటోంది కనుకనే ఈవిదంగా డ్రామా ఆడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల జీవితాలతో ఆటలు ఆడుతూనే ఉంది. కనుక ఈ లోక్‌సభ ఎన్నికలలో వారు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్పబోతున్నారు. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 12 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలోను, పార్లమెంట్‌లోనూ ప్రజల గొంతు బలంగా వినిపించబోతోంది,” అని రావుల అన్నారు.


Related Post