కుటుంబాల కోసమే కాంగ్రెస్‌, బిఆర్ఎస్: మోడీ

May 08, 2024


img

నేడు వేములవాడలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

రెండు పార్టీలు కూడా కుటుంబం వలన, కుటుంబం చేత, కుటుంబం కొరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. బీజేపీ ఒక్కటే దేశం కోసం పనిచేస్తుందన్నారు. 

తెలంగాణను పాలించిన, పాలిస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతిలో పోటీ పడుతున్నాయని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించేది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకునేందుకు వెనకాడుతోంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆర్ఆర్ (రేవంత్‌ రెడ్డి) టాక్స్ గురించి  యావత్ దేశం చెప్పుకుంటోందన్నారు. ఈ ఆర్ఆర్ టాక్స్ ఆర్ఆర్ఆర్‌ సినిమా వసూళ్ళకంటే మించిపోయాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. 

కరీంనగర్‌లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ఎవరో కూడా తెలీదు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ఓటమి, బండి సంజయ్‌ గెలుపు రెండూ ముందే ఖరారయ్యాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ.   

ఇప్పటికే రెండు సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, మూడో సారి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుందని, కానీ ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికలలో ఇండియా కూటమి ఓడిపోవడం ఖరారు అయిపోయిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 


Related Post