బిజెపి మైండ్ గేమ్ ఆడుతోందా లేక...

July 13, 2019


img

బిజెపి మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇవాళ్ళ ఒక సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ కుమార్తె కవిత, వినోద్ ఓటమితో రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభం అయ్యింది. డి శ్రీనివాస్‌తో సహా కొందరు తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపిలో చేరబోతున్నారు. తెరాస పాలనలో రాష్ట్రంలో అవినీతి, నిరంకుశత్వం, కుటుంబపాలన సాగుతోంది. కనుక ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగి అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు. 

డి. శ్రీనివాస్‌ను తెరాస చాలా కాలంగా దూరంగా పెట్టింది. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బిజెపి తరపున నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. కనుక డిఎస్ బిజెపిలో చేరితే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆయనతో పాటు మరికొంతమంది తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపిలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడమే ఆశ్చర్యకరంగా ఉంది. బిజెపి తెలంగాణలో మైండ్ గేమ్స్ ప్రారంభించిందా లేక నిజంగానే తెరాస ప్రజాప్రతినిధులు బిజెపిలో చేరేందుకు సిద్దం అవుతున్నారా? అనే సందేహాలు కలుగుతాయి.

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని దత్తన్నతో బిజెపి నేర్తలు అందరూ పదేపదే చెపుతున్నారు కనుక కాంగ్రెస్ తో పాటు తెరాస ఎమ్మెల్యే, ఎంపీలను కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండవచ్చు. అందుకు మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. తెరాస అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ ఇంతవరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటుచేయలేదు. ఒకవేళ చేసి ఉంటే మరో ఆరుగురికి మంత్రి పదవులు లభించి ఉండేవి. కానీ సిఎం కేసీఆర్‌ అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో మంత్రిపదవులు ఆశిస్తున్నవారు అసహనం, అసంతృప్తితో ఉండవచ్చు. అటువంటి వారిని బిజెపిలోకి ఆకర్షించడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందేమో? అందుకే దత్తన్న ఈ మాట అన్నారేమో?


Related Post