జగ్గారెడ్డి నీళ్ళ రాజకీయాలు దేనికి?

May 31, 2019


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ సాగునీటి శాఖా మంత్రి హరీష్‌రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం పరిపాటిగా మారింది. హరీష్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు సింగూరు నీటిని ఇతర జిల్లాలకు తరలించుకుపోవడం వలననే నేడు జిల్లాలో నీటి ఎద్దడి నెలకొందని విమర్శించారు. ఆ సమయంలో తాను ఎమ్మెల్యే కాకపోవడంతో హరీష్‌రావును అడ్డుకోలేకపోయానని ఇప్పుడు అందుకు బాధపడుతున్నానని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పటికీ జిల్లా ప్రజలకు త్రాగునీటిని తీసుకురాలేని స్థితిలో ఉన్నానని అన్నారు. కనుక సంగారెడ్డికి నీళ్ళు తీసుకువచ్చిన తరువాతే ప్రభుత్వ పెద్దలు జిల్లా ప్రజలను ఓట్లు అడగాలని జగ్గారెడ్డి అన్నారు. 

జగ్గారెడ్డి తెరాసలో చేరే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించినప్పుడు ఆయన వాటిని ఖండించలేదు పైగా “ఎప్పుడు ఏ పార్టీలో ఉంటానో కాలమే చెపుతుంది,” అంటూ తెరాసలో చేరే అవకాశం ఉందని సూచించారు. 

తెరాసలో చేరాలనుకొంటున్నప్పుడు ఆ పార్టీలో సీనియర్ నేత హరీష్‌రావుపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు?అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే నియోజకవర్గంలో నీటి సమస్యతో సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీలు గుప్పించిన జగ్గారెడ్డి ఇప్పుడు ప్రజలు తనను తప్పు పట్టకుండా ఉండేందుకే హరీష్‌రావును సంగారెడ్డి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? తెరాస ప్రభుత్వాన్ని, నేతలను ఎవరైనా వేలెత్తి చూపితే తీవ్రంగా విరుచుకుపడే తెరాస నేతలు హరీష్‌రావును జగ్గారెడ్డి ఇంతగా విమర్శిస్తుంటే ఎందుకు స్పందించడం లేదు? అనే సందేహాలు కలగడం సహజం. 

లోక్‌సభ ఎన్నికలు పూర్తయిపోయాయి కనుక త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తెరాసలో విలీనం, మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించవచ్చు.


Related Post