కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏమి చేయగలరు?

May 31, 2019


img

బిజెపి సికిందరాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి  కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం కేవలం బిజెపిలోనే సాధ్యం. ప్రధాని నరేంద్రమోడీ, సాటి మంత్రుల సహాయసహకారాలతో తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన సమస్యలను పరిష్కరించేందుకు గట్టిగా కృషి చేస్తాను. గత ఐదేళ్ళలోనే మా ప్రభుత్వం విభజన హామీలలో చాలా వరకు నెరవేర్చింది. మిగిలినవాటిని కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తాను. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ దాని ఏర్పాటుకు కృషి చేస్తాను. 

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రభంజనం చూసి రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి కూడా భయపడుతున్నారు. కనుక రాష్ట్రంలోనే కాదు...దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే. తెలంగాణ రాష్ట్రంలో ఎదిగేందుకు బిజెపికి మంచి అవకాశం ఉందని లోక్‌సభ ఫలితాలు నిరూపించాయి. కనుక రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాము. రాష్ట్రంలో తెరాసకు బిజెపియే ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది,” అని అన్నారు. 

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయినప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాల కనుసన్నలలోనే పనిచేస్తారని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై గతంలో ప్రధాని మోడీ ఎటువంటి వైఖరితో ఉన్నారో ఇప్పుడూ అదేవిధంగా ఉండవచ్చు కనుక కిషన్‌రెడ్డి రాష్ట్రానికి కొత్తగా ఏదో చేస్తారని ఇప్పుడే ఆశపడటం తొందరపాటే అవుతుంది. కానీ తెలంగాణలో గట్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునని లోక్‌సభ ఫలితాలతో స్పష్టం అయ్యింది కనుక ఇకపై రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు కిషన్‌రెడ్డితో సహా అందరూ గట్టిగా కృషి చేయడం ఖాయమనే చెప్పవచ్చు.


Related Post