రాహుల్ అస్త్రసన్యాసం...మౌనముద్రలో కాంగ్రెస్‌!

May 31, 2019


img

సుమారు నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై పార్టీలో కొందరు సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేసినందుకు పార్టీ అధ్యక్ష పదవి తనకు కట్టబెట్టనందుకు అలిగి విదేశాలకు వెళ్ళిపోయారు. రెండున్నర నెలలపాటు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించిన తరువాతే విదేశాల నుంచి రాహుల్ గాంధీ తిరిగి వచ్చారు. అప్పుడు అధ్యక్ష పదవి ఇవ్వలేదని అస్త్రసన్యాసం చేస్తే, ఇప్పుడు అధ్యక్ష పదవి వద్దని అస్త్రసన్యాసం చేసి కూర్చోన్నారు.    

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో ఇక పార్టీ అధ్యక్షుడిగా కొనసాగదలచుకోలేదని రాహుల్ గాంధీ మంకుపట్టు పట్టి కూర్చోన్నారు. సోనియా, ప్రియాంకా, కాంగ్రెస్‌, యూపీయే నేతలందరూ ఆయనను అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఎంతగా నచ్చజెప్పుతున్నా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గడంలేదు. పైగా సోనియా, ప్రియాంకా వాద్రాలు కాకుండా పార్టీలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నుకొంటే బాగుంటుందని సలహా ఇవ్వడంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏమి చేయాలో పాలుపోవడంలేదు. 

ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో కాంగ్రెస్‌ నేతలు మీడియాతో ఈ సమస్య గురించి ఏదైనా మాట్లాడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్‌ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకొంది. నెలరోజుల పాటు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ టీవీ స్టూడియోలలో చర్చలలో పాల్గొనరాదని ఆదేశించింది. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా “అన్ని మీడియా సంస్థలకు, ఎడిటర్స్‌కు ఒక విన్నపం. మీ ఛానెళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలకు కాంగ్రెస్‌ నాయకులను ఆహ్వానించకండి,” అంటూ ఒక ట్వీట్‌ చేశారు.

లోక్‌సభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బనుకొంటే, రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం చేయడం, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని నెహ్రూ కుటుంబానికి చెందని బయటి వ్యక్తులకు కట్టబెట్టాలని పట్టుబట్టడం ఇంకా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి కాంగ్రెస్‌ ఏవిధంగా ఎప్పటికీ బయటపడుతుందో, బయటపడి మళ్ళీ ఎప్పటికీ పునర్వైభవం సాధిస్తుందో చూడాలి. 


Related Post