అందుకు కిషన్‌రెడ్డి సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి

May 30, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం చవిచూసిన బిజెపి నేతలలో కిషన్‌రెడ్డి కూడా ఒకరు. ఆయన అంబర్ పేట నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి కేవలం 1,116 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడు ఓడిపోయినందుకు ఆయనతో సహా ఆయన అభిమానులు అందరూ చాలా బాధ పడ్డారు. కానీ ఆ ఓటమే ఆయనకు ఒక వరంగా మారింది. ఆ ఎన్నికలలో ఆయన గెలిచి ఉండి ఉంటే నేడు శాసనసభ్యుడిగా మిగిలిపోయుండేవారు. కానీ ఆ ఓటమితోనే ఆయన రాజకీయ జీవితంలో మరోమెట్టుపైకి ఎక్కగలగడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆయన సికిందరాబాద్‌ నుంచి పోటీ చేసి 62,144 ఓట్ల మోజార్టీతో ఘనవిజయం సాధించారు. ఆ విజయమే నేడు కేంద్రమంత్రిగా ఎదిగేందుకు దోహదపడింది. 

ఇదంతా సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలనే జరిగిందని చెప్పక తప్పదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోలాగ తెలంగాణలో కూడా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి కలిపి నిర్వహించి ఉండి ఉంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో తెలియదు కానీ కిషన్‌రెడ్డికి ఈ అపూర్వ అవకాశం లభించి ఉండేది కాదేమో?కనుక శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించి ఈ అవకాశం కల్పించినందుకు కిషన్‌రెడ్డి సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో? కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈవిధంగా రెండో ఛాన్స్ తో విజయం సాధించిన కిషన్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలలో కిషన్‌రెడ్డి ఒక్కరికే ఈ అవకాశం లభించింది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీల విజయాలు వృధా అయిపోయాయి.


Related Post