ఒకరు ఆత్మవిశ్వాసంతో...మరొకరు ముళ్ళకిరీటంతో అధికారంలోకి

May 30, 2019


img

ఇవాళ్ళ మధ్యాహ్నం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎంగా, రాత్రి నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చినందుకు ఇద్దరికీ సంతోషమే కానీ వారి పరిస్థితులే పూర్తి భిన్నంగా ఉన్నాయి. నరేంద్రమోడీ భారీ మెజార్టీతో రెండవసారి ప్రధాని పదవి చేపడుతున్నారు కనుక ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కల నెరవేరుతున్నప్పటికీ రాష్ట్ర ఆర్ధికస్థితి దయనీయంగా ఉండటంతో ముళ్ళ కిరీటం ధరించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోన్నట్లవుతోంది. 

గత 5 ఏళ్ళలో నోట్లరద్దు, జిఎస్టి వంటి నిర్ణయాలతో నరేంద్రమోడీ చాలా ప్రజావ్యతిరేకత మూటగట్టుకొన్నప్పటికీ, మళ్ళీ తిరుగులేని మెజార్టీతో గెలిపించినందున ఇకముందు ఇంకా దూకుడుగా వ్యవహరించవచ్చు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటివి చేయవచ్చు. గుజరాత్‌లో కొత్తగా నిర్మిస్తున్న ‘దొలేరా’ నగర నిర్మాణ పనులు మరింత ఊపందుకోవచ్చు. అలాగే మోడీ మానసపుత్రిక అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు పనులు కూడా ఊపందుకోవచ్చు.  

దేశంలో అన్ని రాష్ట్రాలలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ మరింత జోరుగా ప్రయత్నాలు చేయవచ్చు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి. తమ తదుపరి లక్ష్యం తెలంగాణయేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెపుతున్నారు కనుక కేసీఆర్‌ సర్కార్ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఏపీలో జగన్ సర్కార్ నిధుల కోసం కేంద్రంపైనే ఆధారపడుతుంది కనుక ఏపీలో కూడా బిజెపి ఎదుగుదలకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.


Related Post