జగన్ అనే నేను...

May 30, 2019


img

ముఖ్యమంత్రి పదవి కోసం సుమారు దశాబ్దంపైగా ఎదురుచూసిన జగన్‌మోహన్‌రెడ్డి కల నేడు నెరవేరబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఆయన చేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. జూన్ 7-8 తేదీలలో మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని 11,12 తేదీలలో శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. 

జగన్ చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే మిగిలుందని, ఉద్యోగుల జీతాలు, పింఛను చెల్లింపుల కోసం అత్యవసరంగా కనీసం రూ.5,000 కోట్లు అవసరమని, దాని కోసం మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళడం తప్ప మరోమార్గం లేదని సమాచారం. 

రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఇంత దయనీయంగా ఉందనే సంగతి మాజీ సిఎం చంద్రబాబునాయుడు కానీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు గానీ ఏనాడూ చెప్పకపోవడంతో నిన్నటి వరకు టిడిపి హయాంలో ‘ఆల్-ఈజ్-వెల్’ పాట వినబడింది. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలవగానే జగన్‌కు ఈవిషయం తెలియడంతో ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి వివరించి అత్యవసరంగా నిధులు విడుదల చేయాలని కోరారు. అయితే జగన్ అడగగనే మోడీ ఏపీకి నిధులు విడుదల చేస్తారా? అంటే కాలమే సమాధానం చెపుతుంది. 

ఈ పరిస్థితులలో...జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన ‘నవరత్నాల’ హామీలను నెరవేర్చాలి. సంక్షేమ పధకాలు యధాతధంగా కొనసాగించాలి. రాజధాని, పోలవరం నిర్మాణపనులు పూర్తి చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ప్రత్యేకహోదా ఇవ్వనందునే ఏ‌పీకి పరిశ్రమలు రావడం లేదని జగన్ గట్టిగా వాదించేవారు. కానీ నరేంద్రమోడీ ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వరని బాబు హయాంలోనే తేలిపోయింది. కనుక రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికాభివృద్ధి సాధించడం ఇంకా పెద్ద సవాలు.

ఈ పరిస్థితులలో జగన్‌ ప్రభుత్వం కూడా నిధుల కోసం కేంద్రప్రభుత్వంపై ఆధారపడకతప్పదు. కేంద్రం సహకారంతో ఈ 5 ఏళ్ళలో జగన్‌ ఇవన్నీ సాధించి చూపగలిగితే రాష్ట్రంలో బిజెపికి శాస్వితంగా తలుపులు మూసుకుపోయే ప్రమాదం ఉంది కనుక మోడీ సర్కార్ జగన్‌ ప్రభుత్వానికి ఉదారంగా సహాయసహకారాలు అందిస్తారనుకొంటే అత్యశే అవుతుంది.     

కానీ ఈ పరిస్థితులలో కూడా ఒకవేళ జగన్‌ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి అభివృద్ధిపధంలో నడిపించగలిగితే ఇక ఆయనకు తిరుగు ఉండదు.


Related Post