అది ఎల్టీటీఈ పనేనా?

April 22, 2019
img

శ్రీలంక రాజధాని కొలొంబోలో ఆదివారం జరిగిన వరుస బాంబు దాడులలో చనిపోయిన వారి సంఖ్య 290కు చేరుకొంది. ఈ ఘటనలో 500 మందికిపైగా గాయపడ్డారు. చనిపోయినవారిలో రమేశ్, లక్ష్మి, రేజీనా, నారాయణ్ చంద్రశేఖర్, కెజి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప అనే ఆరుగురు భారతీయులు ఉన్నారని భారత్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ మీడియాకు తెలిపారు.  

నిన్న కొలొంబోలో వరుస ప్రేలుళ్ళు జరిగిన తరువాత శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయం, బస్టాండ్లు, పార్కులు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాలలో భద్రతాదళాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కొలొంబో అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ భవనంలో అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబును కనుగొన్నారు. సకాలంలో దానిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది లేకుంటే విమానాశ్రయంలో ఉన్న వందలాది ప్రయాణికులు మరణించి ఉండేవారు. ఆ ఐఈడీ పైపు బాంబు స్థానికంగా తయారుచేసినదేనని బాంబు నిపుణులు కనుగొన్నారు. అంత శక్తివంతమైన, ప్రమాదకరమైన బాంబును అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ లోనికి ఎవరు ఏవిధంగా తీసుకువచ్చి అక్కడ అమర్చారో తెలుసుకొనేందుకు భద్రతానిపుణులు సిసి కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

2009లో శ్రీలంక భద్రతాదళాలు ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థపై పెద్ద ఎత్తున దాడి చేసి దాని కమాండర్ ప్రభాకరన్ ను హతమార్చినప్పటి నుంచి శ్రీలంకలో ఎల్టీటీఈ ఉనికి కోల్పోయింది. నిన్న జరిగిన ప్రేలుళ్ళలో ఉపయోగించిన బాంబులు స్థానికంగా తయారుచేసినట్లు స్పష్టం అవుతోంది కనుక అటువంటి బాంబులను తయారుచేసి పేల్చగల నేర్పు కేవలం ఎల్టీటీఈకే ఉంది కనుక శ్రీలంకలో ఎల్టీటీఈకే మళ్ళీ జీవం పోసుకొందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Post