కడియం, తెల్లంపై అనర్హత వేటు వేయించండి ప్లీజ్

May 01, 2024


img

బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ప్రతినిధులు స్పీకర్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

కానీ తమ వినతిపత్రంపై ఇంతవరకు స్పీకర్‌ ఎటువంటి చర్య తీసుకోలేదని, కనుక వారిరువురిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ కుత్బుల్లాపూర్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

 దానిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుని జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, స్పీకర్‌ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఇదివరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలనుఫిరాయింపజేసుకున్నప్పుడు, ఆ రెండు పార్టీలు కూడా ఇలాగే స్పీకర్‌ని ఆశ్రయిస్తే చాలా కాలంపాటు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అప్పుడు ఆ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టుని ఆశ్రయిస్తే, ఇది స్పీకర్‌ పరిధిలో ఉన్న అంశమని, రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థలు, శాసనసభ, పార్లమెంట్‌ వ్యవస్థలలో జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. 

ఆ సమయంలో టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వంటివారు చాలామంది ఉన్నారు. అప్పుడు కేసీఆర్‌ వారందరికీ మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

అప్పుడు అది బిఆర్ఎస్ పార్టీలో ఎవరికీ తప్పుగా అనిపించలేదు. కానీ అదే కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే బిఆర్ఎస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని వాదిస్తూ అనర్హత వేటు వేసి తీరాల్సిందే అన్నట్లు కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

కానీ ఆనాడు బిఆర్ఎస్ హయాంలో ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని, కోర్టు తీర్పులు కూడా అదేవిదంగా ఉండబోతున్నాయని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. 


Related Post