విజయ్ దేవరకొండ-సుకుమార్ కలిసి ఓ సినిమా అనుకుని చాలా కాలమే అయ్యింది కానీ ఇద్దరికీ కుదరకపోవడంతో ఇంతవరకు ఆ సినిమా మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాకి ఇద్దరు ఒకే అనుకున్నారు.
కానీ నేటికీ ఇద్దరూ వేరే సినిమాలతో బిజీగా ఉండటం చేత ఈ ఏడాదిలో కూడా ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం లేదు. వచ్చే ఏడాది చివరిలోగా మొదలుపెట్టి 2026లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘జెర్సీ’వంటి సూపర్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా మొదలుపెట్టాడు. పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఆ సినిమా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీస్తున్నారు. దాని తర్వాత దర్శకుడు రవి కిరణ్ కోలా, దిల్‌రాజులతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు దాని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా చేయబోతున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు పూర్తిచేసేలోగా సుకుమార్ పుష్ప-2 పూర్తిచేసి, రామ్ చరణ్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. పుష్ప-3 కూడా తీస్తామని అల్లు అర్జున్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. కనుక అది సుకుమార్ మద్యలో అది మొదలుపెట్టకుండా ఈ లెక్క ప్రకారమే సినిమాలు చేస్తేనే విజయ్ దేవరకొండ-సుకుమార్ సినిమా పట్టాలు ఎక్కుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ మద్యలో మరో సినిమా ఒప్పుకున్నా ఈ సినిమా అటకెక్కిపోవచ్చు.
ఆనంద్ దేవరకొండతో గంగం గనేశా తీస్తున్న నిర్మాత కేదార్ సెలగం శెట్టి సోమవారం హైదరాబాద్‌లో ఆ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు, సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడారు. రామ్ చరణ్‌తో సినిమా పూర్తిచేయగానే విజయ్ దేవరకొండతో చేస్తానని సుకుమార్ మాటిచ్చారని చెప్పారు.