అమెరికాలో భారత్ టెకీ జంట అనుమానాస్పద మృతి

October 30, 2018
img

భారత్ కు చెందిన విష్ణు విశ్వనాథ్‌ (29), మీనాక్షీ మూర్తి (30) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కనుగొన్నారు. వారిరువురూ కాలిఫోర్నియాలోని యోసెమైట్ అనే జాతీయపార్కు సుమారు 800 అడుగుల ఎత్తైన పర్వతశిఖరంపై హాయిగా నవ్వుతూ సెల్ఫీ ఫోటో తీసుకొని దానిని తమ ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు.

ఆ తరువాత వారితో వారి బందుమిత్రులు మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు వారిరువురు చివరిసారిగా ఫోటో దిగిన ప్రాంతానికి వెళ్ళి వారి ఆచూకీ కోసం గాలించగా కొండ దిగువ లోయలో వారి శవాలు లభించాయి. పోలీసులు వారి శవాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకు తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన ప్రాధమిక సమాచారం ప్రకారం ఆ దంపతులు పొరపాటున కాలుజారి కొండపై నుంచి లోయలో పడిపోయుండవచ్చునని తెలుస్తోంది. 

కేరళ రాష్ట్రానికి చెందిన వారిరువురూ చెంగునూర్ ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకొన్నారు. అప్పుడే వారిరువురూ ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో 2014లో పెళ్లి చేసుకొన్నారు. ఆ తరువాత ఇద్దరూ అమెరికాలో సిస్కో సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు సంపాదించుకొని హాయిగా జీవితం గడుపుతున్నారు.

ఇద్దరికీ ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు చాలా ఇష్టం కనుక తరచూ ఇటువంటి ప్రదేశాలకు వెళుతూ తమ అనుభూతులను తమ బందుమిత్రులతో సోషల్ మీడియా ద్వారా పంచుకొంటుంటారు. మొన్న కూడా ఆదేచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈసారి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారిరువురూ అన్యోన్యంగా ఉంటారని బందుమిత్రులు చెపుతున్నారు కనుక ఎత్తైన కొండచరియపై నిలబడి సెల్ఫీలు తీసుకొంటున్నప్పుడు ప్రమాదవశాత్తు క్రిందపడి చనిపోయుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే సెల్ఫీ పిచ్చికి మరో రెండు నిండు ప్రాణాలు బలయినట్లే. 

Related Post