భారత్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ గుండె పగిలింది… రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పేశారు! పారిస్ ఒలింపిక్స్‌లో నిన్న రాత్రి జరిగిన 50 కేజీల మహిళల రెజ్లింగ్ ఫైనల్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించాలని తపించగా 100 గ్రాములు అధిక బరువు ఉన్నందుకు ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో ఆమె గుండె పగిలింది. ఆమెతో పాటు కోట్లాదిమంది భారతీయులు కంట తడిపెట్టారు.
వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిందని తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ ఆమెను ఓదార్చుతూ “వినేష్ నువ్వు చాంపియన్లలో ఛాంపియన్‌వి. నువ్వు భారత్‌కు గర్వకారణం. నువ్వు ప్రతీ భారతీయుడికి స్పూర్తిదాయకం. ఈ ఎదురుదెబ్బ చాలా బాధాకరమే. దీని వలన నా మనసులో కలిగిన బాధని నా మాటల ద్వారా వ్యక్తీకరించాయనే అనుకుంటున్నాను,” అని ట్వీట్ చేశారు.
ఇంకా ఆనంద్ మహీంద్రా, పలువురు ప్రముఖులు, క్రీడాకారులు వినేష్ ఫోగట్‌కు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ పోటీ కోసం వినేష్ ఫోగట్ ఎంతగా శ్రమించారో, తపించారో ఆమెకే తెలుసు. అందుకే క్రీడల నుంచి, రెజిలింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
“నేను ఓడిపోయాను. నాపై కుస్తీ గెలిచింది. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇకపై నాకు పోరాడే బలం లేదు. నన్ను క్షమించండి. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024,” అని వినేష్ ఫోగట్ ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఆమె అంతర్జాతీయ క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో పిటిషన్ వేసి తన అనర్హతపై పునః పరిశీలించి ఫైనల్స్‌లో ఆడేందుకు అవకాశం కల్పించాలని అపీల్ చేశారు. అలాగే తాను ఫైనల్స్‌కు చేరిన తర్వాతే అనర్హతకి గురైనందున రజత పతకానికి అర్హురాలినని, కనుక పతకం ఇప్పించాల్సిందిగా కోరారు. ఆమె పిటిషన్ విచారణకు స్వీకరించిన్నట్లు న్యాయస్థానం తెలియజేసింది. నేడు తీర్పు ఇవ్వనుంది.