కేసీఆర్‌ ఎవరికి జాతిపిత? సిఎం రేవంత్ ప్రశ్న

February 05, 2026
img

బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సిఎం రేవంత్ రెడ్డి జాతిపిత అంటూ బీఆర్ఎస్‌ పార్టీ చేసుకుంటున్న ప్రచారంపై స్పందిస్తూ చురకలు వేశారు. “మొగుడు పెళ్ళాం ఫోన్లో మాట్లాడుకుంటే చాటుగా వినేవాడు జాతిపితా?ఆయన ఎవరికి జాతిపిత?తన కాళ్ళ వద్ద పడి ఉండే బీఆర్ఎస్‌ నేతల జాతికి ఆయన జాతిపిత అంటే అందరూ అంగీకరిస్తారేమో కానీ తెలంగాణకు జాతిపిత అంటే ఎవరూ అంగీకరించరు. 

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు బలిదానం చేసుకున్న అమరావీరులే అసలైన జాతిపితలు. వారిని మనం వారందరినీ గౌరవించుకుందాం. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్‌ నేరస్తులని కాదు. ఒకవేళ ఆయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవం దెబ్బ తింటుందనే వాదన నిజమే అనుకుంటే, మరి ఎర్రవల్లి, ధన్వాడ, మెదక్ ఇంకా రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఫామ్‌హౌసులన్నీ ప్రజలవేనా? మీ భూములు, ఫామ్‌హౌసులు అన్నీ ప్రజలకు ఇచ్చేస్తారా?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి చురకలు వేశారు. 

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, “కేసీఆర్‌ పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించారు. కానీ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించగల ఈ ప్రాజెక్టుని అసలు పట్టించుకోలేదు. కానీ ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా మా ప్రభుత్వం 30 కిమీ సొరంగం పనులు పూర్తి చేసింది. మిగిలినది కూడా పూర్తి చేసి నీళ్ళు తెచ్చేది ఇచ్చేది మా ప్రభుత్వమే. కనుక జిల్లాకు మేలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని ఆదరించి మున్సిపల్ ఎన్నికలలో మా పార్టీని గెలిపించవలసిందిగా” సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

Related Post