నేడు దాశరధి జయంతి

July 22, 2025
img

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దశాబ్దాల క్రితమే తెలంగాణ గొప్పదనాన్ని వర్ణిస్తూ కవితలల్లిన ప్రముఖ కవి దాశరధి కృష్ణమాచార్యులు జయంతి నేడు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, వివిధ పార్టీలకు చెందినా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.   

దాశరథి కృష్ణమాచార్య (1925 – 1987), ప్రముఖంగా దాశరథి పేరుతో ప్రసిద్ధి. నిజాం పాలనలో తెలంగాణ ఉద్యమానికి తన విప్లవాత్మక కవిత్వంతో శక్తినిచ్చారు.

దాశరధి కృష్ణమాచార్యులు కేవలం మెట్రిక్యులేషన్ (పదో తరగతి) వరకే చదువుకున్నప్పటికీ తెలుగు, సంస్కృతం, తమిళ భాషలపై పట్టు సాధించారు. నిజాం నవాబుల అరాచాకాలపై తిరుగుబాటు చేసి 1947లో జైలుకు వెళ్ళారు. అక్కడ కూడా తన పోరాటాలు ఆపకుండా నిజాం అరాచకాలను ఖండిస్తూ అనేక కవితలు రాశారు.

దాశరధికి గొప్ప గుర్తింపు తెచ్చిన కవితలలో అగ్నిధారా (1947), తిమిరంతో సమరం, రుద్రవీణ, పునర్నవం, గాలిబ్ కవితలున్నాయి. వీటిలో తిమిరంతో సమరం కవితా సంకలనానికి 1974లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 

సామాజిక సమస్యలని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెపుతూ అనేక కవితలు వ్రాసిన దాశరధి తెలుగు ప్రజలను తన సినిమా పాటలతో కూడా అలరించారు. అయన సుమారు 2,000కి పైగా పాటలు వ్రాశారు. 

దాశరధి ప్రతిభని గుర్తింపుగా ‘అభ్యుదయ కవి,’ ‘కళాప్రపూర్ణ’ వంటి బిరుదులు పొందారు. సమైక్య రాష్ట్రంలో  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనని (1971-84) ఆస్థాన కవిగా నియమించుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య అవార్డును ప్రారంభించింది.

Related Post