హైడ్రాకు హైకోర్టు బ్రేకులు.. కూల్చివేతలపై స్టే!

April 14, 2026


img

హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎక్కడా, ఎటువంటి కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

సోమవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు హైడ్రా సిబ్బంది సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందినా రైతు ఎంఎ షరీఫ్ నీళ్ళ ట్యాంకుని, ప్రహారీగోడను కూల్చివేశారు. 

హైడ్రా అక్రమ కట్టడాలుగా చెపుతూ కూల్చివేసినవి వందేళ్ళనాటి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి అని పిటిషనర్‌ పేర్కొన్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా హైడ్రా ఈవిధంగా ఇళ్ళు కూల్చివేస్తూ ప్రజలను భయబ్రాంతులు చేస్తోందని ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు.

దీనిపై జస్టిస్ బి.విజయ్ విశ్వక్ సేన్‌ రెడ్డి విచారణ చేపట్టి హైడ్రాకు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, హైడ్రా పనిచేసే విధివిధానాలు, నియమ నిబంధనలు, అధికారులు, పరిమితులకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. 

హైడ్రా తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, “కోర్టు ఉత్తర్వుల ప్రకారం సర్వే నం: 165 నుంచి 175 వరకు, సర్వేనం.లు 212, 213లో కేవలం 36.37 ఎకరాలు మాత్రమే వాడుకునేందుకు అనుమతి ఉండగా, కోర్టు ఉత్తర్వులను వక్రీకరించి ఏకంగా 1,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు పిటిషనర్ ప్రయత్నిస్తున్నారన్నారు. రికార్డులన్నీ పరిశీలించి అవి ఆక్రమణలని నిర్ధారించుకున్న తర్వాతే  హైడ్రా కూల్చి వేసిందని హైకోర్టుకి తెలియజేశారు. 

కానీ కూల్చివేతలకు ముందు నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే న్యాయమూర్తి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెరువులు, నాలాలు, రోడ్లు పునరుద్దరణ పనులు చేసుకోవచ్చునని, కానీ కూల్చివేతలు చేపడితే కటిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ బి.విజయ్ విశ్వక్ సేన్‌ రెడ్డి హెచ్చరించారు.


Related Post