ప్రముఖ హిందీ సినీ గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోంస్లే (92) ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.
గత కొంత కాలంగా వృధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు శనివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు.
ఆమె మృతిపై ప్రధాని మోడీతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.
లతా మంగేష్కర్ చెల్లెలే ఆశా భోంస్లే. ఇద్దరూ దాదాపు ఆరేడు దశాబ్దాలుగా తమ మధురమైన గొంతులతో వేలాది పాటలు పాడి అందరినీ అలరించారు. వారిరువురికీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలలో కూడా లక్షల మంది అభిమానులున్నారు. భారతీయ సినీ పరిశ్రమతో విడదీయరాని అనుబంధం కలిగిన వారిరువురి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
భారతీయ సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ 2022, ఫిభ్రవరి 6వ తేదీన ఇదే బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్ను మూశారు. ఇప్పుడు ఆమె సోదరి ఆశా భోంస్లే కూడా అభిమానులను వీడి కానరాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు.