కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం లభించడం లేదంటూ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమై కేసీఆర్‌ని కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన విమర్శలపై ప్రభుత్వ విప్ అదివారం శ్రీనివాస్ స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీలో అనేకసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చినా సముచిత గౌరవం దక్కలేదన్నారు. మరి కేసీఆర్ మీకు సముచిత గౌరవం ఇస్తారా? మీ ఆత్మగౌరవం కాపాడుతారా? ఆయన ఎంత మంది సీనియర్లను దారుణంగా అవమానించి బయటకు వెళ్ళగొట్టారో మీకు తెలియదా?
కేసీఆర్ పదేళ్ళ అవినీతి పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశానని చెప్పుకున్న మీరు ఇప్పుడు ఆయన పంచన చేరి, దేవుడే నన్ను మీ వద్దకు పంపించారని, మీతో కలిసి పనిచేయడం నా భాగ్యమని చెప్పుకోడం సిగ్గనిపించడం లేదా?
రాజకీయంగా మీకు ఇంత గుర్తింపు, గౌరవం కల్పించిన కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లు అనుచితవ్యాఖ్యలు చేయడం తగదు. కేసీఆర్ నిరంకుశ పాలన భరించలేకనే ప్రజలు ఆయనని గద్దె దించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూడా గుండు సున్నా ఇచ్చారు. అలాంటి కేసీఆర్ మీకు ఆదర్శమా?
అయినా వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులతో కలిసి ఎలా పనిచేస్తారు? మునిగిపోయే నావలో ఎక్కి కాంగ్రెస్ పార్టీని నిందిస్తే మీకే నష్టం. మాకు కాదు,” అని అన్నారు.