తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దపడిన జీవన్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్‌హౌసులో భోజనానికి ఆహ్వానించారు. కనుక కేసీఆర్‌తో అన్నీ మాట్లాడుకున్నాక మంచి రోజు చూసుకొని జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సుమారు 40 ఏళ్ళు పనిచేశారు. కనుక ఆ పార్టీ బలాలు బలహీనతలు అన్నీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆయువుపట్టు వంటి సిఎం రేవంత్ రెడ్డి గురించి బాగా తెలుసు. కనుక బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరిక ఆ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించే అవకాశం ఉంటుంది.
మంత్రి పదవి ఇవ్వనందుకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వంటి పలువురు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనుక జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్న తర్వాత సిఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని చేయబోయే విమర్శలతో అటువంటివారు కూడా బీఆర్ఎస్ పార్టీవైపు చూసే అవకాశం ఉంటుంది.
జీవన్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కనుక ఈ ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండక తప్పదు.