తెలంగాణ మాతాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి లీగల్ నోటీస్ పంపారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో ఆమె రూ.30 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ కేటీఆర్ ఆరోపించారు.
మంత్రి సీతక్క స్పందిస్తూ, “రూ.44 కోట్లు పెట్టి ఒక్కో మొబైల్ ఫోన్ రూ.11,650 చొప్పున ఖరీదు చేస్తే, దానిలో రూ.30 కోట్లు అవినీతికి పాల్పడ్డానని కేటీఆర్ ఆరోపణ చాలా హాస్యాస్పదంగా ఉంది. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ 48 గంటలలోగా సాక్ష్యాధారాలు చూపాలి. లేదా నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ఆరోపణలు తొలగించాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలి.
ఈ మోబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారాన్ని వాల్యూయేషన్ కమిటీ పరిశీలించి సూచనలు చేసింది. వాటి ప్రకారమే తెలంగాణ టెక్నాలజీ సర్వీసస్ లిమిటెడ్ బహిరంగ టెండర్లు ఆహ్వానించి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియలో నేను ఏ దశలో జోక్యం చేసుకోలేదు.
ఈ కొనుగోలు వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. అయినా కేటీఆర్ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. కనుక అయన క్షమాపణ చెప్పాల్సిందే లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే,” అని మంత్రి సీతక్క హెచ్చరించారు.