రామాయణ, మహాభారతాలపై వచ్చినన్ని సినిమాలు మహాభాగవతం మీద రాలేదనే చెప్పాలి. ఆ లోటు తీర్చబోతోంది ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్మెంట్. ‘శ్రీ మధ్భాగవతం’ పేరుతో ఏడు భాగాలుగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించింది.
హిందువులు ఏడూ రోజుల పాటు భాగవత పారాయణం చేస్తుంటారు. కనుక ఏడు భాగాలుగా తీయబోతున్న ఈ సినిమాలని కలిపి ‘సప్త’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్మెంట్ తెలిపింది.
గతంలో తెలుగుతో సహా అన్ని భాషలలో ఇటువంటి భక్తి ప్రధానమైన పౌరాణిక సినిమాలు వస్తుండేవి. ప్రేక్షకులను అలరిస్తుండేవి.
కానీ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దర్శక నిర్మాతలు ఆ మోజులో పడి ఆధ్యాత్మికత కంటే హాలీవుడ్ యాక్షన్ మూవీలా రూపొందిస్తుండటంతో వందలు, వేల కోట్లు పెట్టి తీసిన పౌరాణిక సినిమాలను భారతీయ ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇందుకు చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కనుక సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్మెంట్ ‘శ్రీ మధ్భాగవతం’తో అటువంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోదని ఆశిద్దాం.