బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్‌లో పెద్ది చాలా భారీ అంచనాల నడుమ జూన్ 4న విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్) టికెట్స్ ఆదాయంలో పర్సంటేజ్ విధానం అమలుచేయాలని, అందుకు అంగీకరించిన సినిమాలనే థియేటర్లలో ప్రదర్శిస్తామని తేల్చి చెప్పేశారు. పెద్దితో సహా పలు సినిమాలు జూన్‌లో విడుదల కాబోతున్నాయి. కనుక ఈ నిర్ణయం వాటన్నిటికీ ఇబ్బందికరంగా మారుతుంది.
ఇప్పటికే దీనిపై నిర్మాతలు, అసోసియేషన్ ప్రతినిధుల మద్య చర్చలు జరిగాయి. కానీ ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
కనుక నేడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి, సతీష్ కిలారు, యలమంచిలి రవిశంకర్ తదితరులు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఈ సమస్యపై మాట్లాడారు.
పెద్ది వంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ ముందు ఎగ్జిబిటర్స్ ఈవిధంగా బ్లాక్ మెయిల్ చేయడం తగదని నిర్మాత సాహుగారపాటి అన్నారు. సినీ పరిశ్రమలో అందరికీ ఒక్కో రకం సమస్యలున్నాయని కనుక అందరూ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి కానీ ఈవిధంగా సినిమా రిలీజ్ ముందు బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నప్పుడు ఈ డిమాండ్ వచ్చిందని ఆ తర్వాత అనేక సినిమాలు విడుదలయ్యాయి కదా? ఇప్పుడే ఈ డిమాండ్ ఎందుకు?అని ప్రశ్నించారు.
నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ, “ఎగ్జిబిటర్లు అడుగుతునంత పర్సంటేజ్ ఇవ్వాలేము. ఇస్తే వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతకు మిగిలేది ఏమీ ఉండదు. ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తక్షణం అమలు చేయాలని పట్టుబట్టడం సరికాదు. ఈ సమస్యపై జూలై మొదటి వారంలో కూర్చొని చర్చించుకుందాము. అంతవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి,” అని విజ్ఞప్తి చేశారు.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూర్చొని ఈ సమస్యపై చర్చించుకొని ఒక అంగీకారానికి వస్తే బాగుంటుంది. కానీ ఇలా ఎవరికీ వారు ప్రెస్‌మీట్‌లు, ధర్నాలు నిర్వహిస్తూ ఎదుటవాళ్ళని నిందిస్తుంటే కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది తప్ప సమస్య పరిష్కారం అవదు కదా?