కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి ‘టివికే పార్టీ’తో తమిళనాడు రాజకీయాలలో దిగారు. కానీ అదే ఆయన చివరి సినిమా ‘జన నాయకుడు’కి శాపంగా మారింది. ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతోంది. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది.
కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా రిలీజ్ కాకుండా నిలిచిపోవడంతో నిర్మాతకు చాలా నష్టం వస్తోంది. కనుక నిర్మాత దిగివచ్చి సెన్సార్ బోర్డ్ సూచించినట్లు సినిమాలో సుమారు 20 నిమిషాలు నిడివిగల పలు సన్నివేశాలు తొలగించేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెపుతున్న సన్నివేశాలన్నీ తొలగించేందుకు సిద్ధం అయినందున ఈసారి తప్పకుండా సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని, ఫిభ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేసుకోవచ్చని నిర్మాత ఆశపడుతున్నారు.
కానీ తమిళనాడు, దేశ రాజకీయ వ్యవస్థలని ప్రశ్నించే జన నాయకుడు, ఆదర్శవంతమైన, ప్రజా రంజకమైన రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సినిమాలో చూపినట్లు తెలుస్తోంది.
ఈ ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి ముందు ఈ సినిమా రిలీజ్ అయితే ప్రజలపై ఆ ప్రభావం పడుతుందని అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే-బిజేపిలు భయపడటం సహజం. కనుక ఎన్నికలకు ముందు జన నాయకుడు రీలీజ్ కాకుండా అడ్డుపడే అవకాశం కనిపిస్తోంది.