బిజేపి ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ ఆగ్రహం

April 17, 2026


img

గురువారం లోక్‌సభ కర్ణాటక బిజేపి ఎంపీ తేజస్వీ సూర్య డీలిమిటేషన్‌ చర్చలో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజనని భారత్‌-పాక్‌ విభజనతో పోల్చడంపై తెలంగాణ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ, “బిజేపి నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని, తెలంగాణ ఉద్యమాలను, అమరవీరుల త్యాగాలను పదేపదే అవమానిస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనని భారత్‌-పాక్‌ విభజనతో పోల్చడం అహంకారమే.

 ప్రధాని మోడీ మొదలు ఎంపీ తేజస్వీ వరకు బిజేపిలో ప్రతీ ఒక్కరూ తెలంగాణ పట్ల చులకనగానే మాట్లాడుతున్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,” అని కేటీఆర్‌ అన్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత హరీష్‌ రావు కూడా ఇంచుమించు ఇదేవిధంగా స్పందిస్తూ, లోక్‌సభలో తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటు గురించి ఇంత చులకనగా మాట్లాడుతుంటే సభలోనే ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌, బిజేపి ఎంపీలు వెంటనే ఖండించకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు?” అని ప్రశ్నించారు.

 “తేజస్వీ తక్షణం తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి,” అని హరీష్‌ రావు డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్‌ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి తదితరులు కూడా తేజస్వీ వ్యాఖ్యలను ఖండించారు. అయన తక్షణం తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని, లేకుంటే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.                 

 


Related Post