నేడే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్

April 23, 2026


img

ఈరోజు ఉదయం 7.30 గంటల నుంచి పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నందున రెండు దశలలో పోలింగ్ జరుగుతోంది. నేడు మొదటి దశలో 152 స్థానాలకు, ఏప్రిల్‌ 29న మిగిలిన 142 స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. 

పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ళపాటు వామపక్ష పార్టీ అధికారంలో ఉంది. మమతా బెనర్జీ 2011లో దానిని గద్దె దించి అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కనుక ఆమెను గద్దె దించి పశ్చిమ బెంగాల్లో కాషాయ జండా ఎగరేయాలని బిజేపి గత పదేళ్ళుగా గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ సాధ్యపడలేదు. 

కనుక ఈసారి ఎట్టి పరిస్థితులలో ఆమెను ఓడించి బెంగాల్లో కూడా అధికారంలోకి రావాలని బిజేపి చాలా పట్టుదలగా ఉంది. కనుక తృణమూల్ కాంగ్రెస్‌-బిజేపిల మద్య ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. కనుక పోలింగ్ సమయంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మొహరించారు. 

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు నేడు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా అన్నాడీఎంకే-డీఎంకే పార్టీల మద్యనే అధికార బదిలీ జరుగుతోంది. కనుక రెండు పార్టీలకు బలమైన ఓటు బ్యాంక్, చాలా బలమైన క్యాడర్ ఉంది. 

అన్నాడీఎంకేతో బిజేపి, డీఎంకేతో కాంగ్రెస్‌ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. కనుక ఆ రెండు జాతీయ పార్టీల బలం, సహాయసహకారాలు కూడా ద్రవిడ పార్టీలకు ఉన్నాయి... అని తెలిసి ఉన్నా కోలీవుడ్‌ నటుడు విజయ్‌ టివికే పార్టీతో ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగారు. ఆయనకి తమిళనాడులో భారీగా అభిమానులున్నారు. కానీ బలమైన పార్టీ క్యాడర్, ఓటు బ్యాంక్ లేవు. అయినా ఒంటరి పోరుకే సిద్దమయ్యారు. 

ఈ నెల 29వ తేదీ సాయంత్రం పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ సమాప్తం అవుతుంది. అంతవరకు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ ఆంక్ష విధించింది. కనుక తమిళనాడులో విజయ్‌, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భవిష్యత్ తెలియాలంటే ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు ఎదురుచూడాలి. మే 4న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కనుక ఆ రోజున పూర్తి స్పష్టత వస్తుంది.  


Related Post