ఆర్టీసీ సమ్మె సమయంలో ఆదుకుంటున్న మెట్రో!

April 22, 2026
img

టిజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు హైదరాబాద్‌ మెట్రో రోజువారి సర్వీసులు పెంచింది. 

మియాపూర్-ఎల్బీ నగర్‌ మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతీ ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతీ 3నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు నడుస్తోంది. రద్దీ లేని సమయంలో ప్రతీ 4నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు నడుస్తోంది. కానీ నేటి నుంచి రోజంతా ప్రతీ 4 నిమిషాల 20 సెకన్లకు ఒకటి చొప్పున నడిపించబోతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. 

నాగోల్-రాయదుర్గ్ మార్గంలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ప్రతీ 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు నడుస్తోంది. కానీ నేటి నుంచి రోజంతా ప్రతీ 3 నిమిషాల 40 సెకన్లకు ఒకటి చొప్పున నడిపించబోతోంది. ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడిపించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. 

హైదరాబాద్‌ నగర ప్రజలకు మెట్రో ఉంది కనుక ఈ మాత్రం ఉపశమనం లభిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో మెట్రో రైల్ లేదు. కనుక అక్కడి ప్రజలకు సమ్మె ముగిసేవరకు అవస్థలు తప్పవు.

ముఖ్యంగా రోజూ ఉద్యోగాలు, చిన్నా పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు, విద్యార్ధులు, రోజువారి కూలీల కోసం, వైద్యం కోసం పల్లెల్ల నుంచి పట్నాలకు వెళ్ళేవారు సమ్మె వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమ్మె ఈరోజే ప్రారంభమయింది కనుక కనీసం మరో వారం పది రోజులు తప్పక సాగవచ్చు. ఈలోగా ప్రభుత్వం-ఆర్టీసీ-కార్మిక సంఘాలు మద్య ఏదైనా ఒప్పందం కుదిరితే అదృష్టమే. లేకుంటే ఈ వేసవిలో సమ్మె మరింత కాలం కొనసాగితే అందరికీ ఇబ్బందులు తప్పవు. 

Related Post