టిజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం-జేఏసీ నేతల మద్య మంగళవారం రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలమవడంతో నిన్న అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె మొదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. సమ్మె మొదలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు టిజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సహా మొత్తం 31 డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. కానీ వాటన్నిటినీ ఒకేసారి అమలుచేయడం అసాధ్యమని టిజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, టిజీఎస్ ఆర్టీసీ సానుకూలంగా ఉన్నాయి. వారి సమస్యలు, డిమాండ్స్ దశల వారీగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఆర్టీసీ సంఘాల నేతలు నిన్న జరిగిన చర్చల గురించి కార్మికులకు వివరించకుండా వారిని తప్పు దోవ పట్టించడం వల్లనే సమ్మె మొదలుపెట్టారని భావిస్తున్నాము,” అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో టిజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా కాంట్రాక్ట్ పద్దతిలో నడుస్తున్న విద్యుత్ బస్సులతో ప్రజలకు పరిమిత సేవలు అందిస్తోంది.