నిన్న కేసీఆర్ అధ్యక్షతన జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు, సీనియర్ నాయకుడు హరీష్ రావు ఆ సభలో పాల్గొనకుండా హడావుడిగా ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏ ఆర్ఎస్ఎస్ పెద్దల కాళ్ళు పట్టుకున్నారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి నిన్న నిలదీశారు.
ఆయన ప్రశ్నకు హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ, “అవును కేసుల నుంచి ఉపశమనం కోసమే ఢిల్లీకి వెళ్ళా. మాపై తప్పుడు కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డిని న్యాయస్థానాలలో ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడేందుకు మా అధినేత కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీ వెళ్ళాను. ఇందులో తప్పేముంది?
నేనేమి రేవంత్ రెడ్డిలాగ ఢిల్లీలో పగలు బిజేపి నేతలతో రాత్రిళ్ళు రాహుల్ గాంధీతో భేటీ అవడం లేదు కదా? ఓటుకు నోటు కేసు విచారణ కూడా రేపే జరుగుతుంది. ఆ కేసులో ముద్దాయిగా బెయిల్‌పై ఉన్న రేవంత్ రెడ్డి కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కాక తప్పదు. అప్పుడు ఆయన అసలు రంగు బయటపడుతుంది.
నిన్న కేసీఆర్ జగిత్యాల సభకు వచ్చినందునే రేవంత్ రెడ్డి హడావుడిగా రెండో వవిడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. కేసీఆర్ రాకుంటే ఇచ్చేవారా? నిన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు దుష్ప్రచారం చేశారు. కానీ నిన్న దానికి మరమత్తులు చేయిస్తున్నామని చెప్పుకున్నారు. కూలిపోయిన ప్రాజెక్టుకి మరమత్తులు ఎలా సాధ్యమో రేవంత్ రెడ్డి చెప్పాలి,” అని హరీష్ రావు అన్నారు.