రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె!

April 21, 2026


img

బుధవారం నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం గానీ పట్టించుకాలేదని ఆర్టీసీ జేఏసి చైర్మన్‌ వెంకన్న ఆరోపించారు.

ఆయన ఆర్టీసీ సంఘాల నేతలతో కలిసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్‌ మెట్రోకి నష్టాలు వస్తే వెంటనే వేలకోట్లు చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. కానీ ఎప్పటి నుంచో నష్టాలలో ఉన్న ఆర్టీసీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ ఇంతవరకు విలీనం చేయలేదు. ఎందువల్ల? ఆర్టీసీ నష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుంది. కానీ మహాలక్ష్మి పధకం దాని క్రెడిట్ కోసం ఆర్టీసీని వాడుకుంటుంది. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేస్తుంది. ఇదెక్కడి న్యాయం? 

ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంచమని అడిగితే ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటారు? డబ్బు లేకపోతే లక్ష కోట్ల మూసీ ప్రాజెక్టు ఏవిధంగా ప్రారంభించారు? ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ పరిస్థితి, ఉద్యోగుల పరిస్థితి మాత్రం మారడం లేదు. పైగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టి హైదరాబాద్‌లో ఆర్టీసీని పూర్తిగా తుడిచి పెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. 

సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదంటే అర్థం సమ్మె మొదలుపెట్టవచ్చని చెప్పినట్లే భావిస్తున్నాము. కనుక రేపటి నుంచి సమ్మె మొదలుపెట్టబోతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలు జరిపితే అందరికీ మంచిది. లేకుంటే చివరికి ఇది మరో సకల జనుల సమ్మెగా మారే అవకాశం ఉంది,” అని వెంకన్న తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు.


Related Post