ఇద్దరూ కలిసి జీవన్ రెడ్డి గాలి తీసేశారుగా!

April 21, 2026


img

నిన్న జగిత్యాల సభలో జీవన్ రెడ్డికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంటనే అయనని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఇద్దరూ ఇంచుమించు ఒక వయసువారే.. రాజకీయాలలో సీనియర్లే. 

కానీ సిఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వారిద్దరి గాలి తీసేశారు. ఆ వయసులో కూడా మేమే రాష్ట్రానికి దిక్కు...మేమే రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పుకుంటే మరి రాష్ట్రంలో యువత (తన వంటి యువ రాజకీయ నాయకులు) పరిస్థితి ఏమిటని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. 

తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు ఉంటే చాలు తెలంగాణ ఉద్యమాలు, రాష్ట్రం అవసరమే లేదన్నజీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకొని కేసీఆర్‌ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? 

తెలంగాణ ద్రోహులతో రాజకీయ పునరేకీకరణా... వారితో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారా? హవ్వ! సిగ్గు చేటు!” అని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.  

సిఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “నాడు ఎన్టీఆర్ పిలిచి జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చి మంత్రిని చేస్తే, నాదెండ్ల భాస్కర రావుతో చేతులు కలిపి ఆయనకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు జీవన్ రెడ్డి. 

గత 40 ఏళ్ళలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు 14 సార్లు బీఫారం ఇచ్చింది. ఓడిపోయినా పదవులు ఇచ్చి గౌరవించింది. 2023 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారని ఎంపీ టికెట్ ఇస్తే గెలవలేకపోయారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ఇంత గౌరవం, ప్రాధాన్యత ఇస్తే తనకు మర్యాదలు సరిపోలేదంటూ కేసీఆర్‌ పంచన చేరారు. పదవుల కోసం కేసీఆర్‌ పంచన చేరి దేవుడే మీ వద్దకు పంపించాడని నిసిగ్గుగా చెప్పుకున్నారు. 

జీవన్ రెడ్డి ఎప్పుడూ తనకూ తన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పదవులు కావాలనుకుంటారు. కానీ తమకు ఊడిగం చేసిన పార్టీ కార్యకర్తలని కనీసం గాంధీ భవన్‌ గుమ్మం తొక్కనీయరు. నమ్ముకున్న కార్యకర్తలని వంచించిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలో చేరినా ఆయన గుణాలు, బుద్ధులు మారుతాయా? మారవు..” అని త్వరలోనే అందరికీ అర్ధమవుతుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.  



Related Post