ఈరోజు తెలంగాణలో ఒకే సమయంలో సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగిత్యాలలో కేసీఆర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలంలోని నస్తూర్ పల్లిలో సిఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
కనుక ఇద్దరూ ఏం మాట్లాడుతారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీలు సభలకి భారీగా జనసమీకరణ చేయడంతో ఇద్దరి సభలు నిండుగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ సభా వేదికల వద్దకు చేరుకున్నారు. జీవన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటించినప్పుడు అక్కడ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల సభ గురించి ప్రస్తావిస్తూ, మేడిగడ్డ పర్యటన, ఈ సభ అన్నీ నెలరోజుల ముందుగానే ఖరారు అయ్యాయి. కనుక మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడితే తన బండారం బయటపడుతుందనే హడావుడిగా సభ పెట్టుకున్నారు. ఇక్కడ సభ జరుగుతుంటే కాళేశ్వరం కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని బిజేపి అధిష్టానం కాళ్ళు పట్టుకునేందుకు హరీష్ రావుని ఢిల్లీకి పరిగెత్తించారు. కాళేశ్వరం కేసు తమకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావులని పది రోజులలో జైల్లో వేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రెండు లేఖలు వ్రాసినా పట్టించుకోలేదు. దేనికంటే బిజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే. వారిద్దరినీ బిజేపి పెద్దలే కాపాడుతున్నారు.
మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికే హరీష్ రావుని ఢిల్లీ పంపించిన మాట వాస్తవమా కదా? ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలిశారో ఎందుకు కలిశారో చెప్పగలరా? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచేసినా కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ క్రుంగిపోయాయని, కేసీఆర్ అవినీతి, అక్రమాలకూ అదే నిదదర్శనం కాదా? దేశ చరిత్రలో అతి పెద్ద మానవ తప్పిదం ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే,” అని సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
మేడిగడ్డ బ్యారేజ్ వద్దనే సిఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ఏమి మాట్లాడబోతున్నారో క్లుప్తంగా చెప్పేశారు. కానీ కేసీఆర్ ఏం మాట్లడబోతున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. సిఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ వేదికలపైకి చేరుకున్నారు.