జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ ఉబలాటపడుతూ టికెట్ కోసం కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరిగారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా అయనకు మంత్రి పదవే కట్టబెట్టారు. కానీ ఇప్పుడాయన పదవి తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతిలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలలో ఏదో ఒకదానిలో సభ్యులుగా ఉన్నవారు మంత్రి పదవికి అర్హులు. లేకుంటే మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా ఉభయ సభలలో ఏదో ఒక దానిలో సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు.
అజారుద్దీన్ ఏ సభలో సభ్యత్వం లేదు. కనుక ఆరు నెలల గడువు ఏప్రిల్ 30తో ముగుస్తుంది. కనుక ఆయనని, ప్రొఫెసర్ కొందడరామ్ ఇద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కోరేందుకు సిఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసి అభ్యర్ధించారు. దీనిపై ఆయన ఏవిధంగా స్పందించారో ఇంకా తెలియాల్సి ఉంది.
డీలిమిటేషన్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో సిఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా అయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో గవర్నర్ కేంద్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
కనుక సిఎం రేవంత్ రెడ్డి అభ్యర్ధన గురించి కేంద్రానికి తెలియజేసి దాని సూచన ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారిరువురినీ గవర్నర్ నామినేట్ చేస్తే ఏ సమస్యా ఉండదు. కానీ ఒకవేళ కేంద్రం వద్దనుకుంటే గవర్నర్ కూడా ఈ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టవచ్చు. పెడితే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. కనుక అయన మంత్రి పదవి ఇప్పుడు గవర్నర్ చేతిలో ఉందని భావించవచ్చు.