గత వారం పది రోజులుగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోవడం ప్రజలు, పశువులు, పక్షులు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అదివారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వాతావరణంలో మార్పు మొదలై పలు చోట్ల కుండపోతగా వర్షం పడింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. అయితే నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, కొండూరు, మైలారం పెద్ద వాల్గోట్, భీంగల, బాలకొండ తదితర ప్రాంతాలలో భారీగా వడగండ్ల వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అకాల వర్షంతో జిల్లాలో పలు ప్రాంతాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
హైదరాబాద్‌లో సుచిత్రాక్రాస్ రోడ్స్, కొంపల్లి వద్ద కూడా వడగండ్ల వాన పడింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్, చింతల్, సూరారం, దుండిగల్ తదితర ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ళు కూడా పడ్డాయి. సోమవారం,మంగళవారం కూడా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.