హైదరాబాద్‌ ఎంఎంటిఎస్ రైళ్ళలో అందరికీ ఉచిత ప్రయాణం?

April 19, 2026


img

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నానాటికీ ట్రాఫిక్ రద్దీ, దాంతో కాలుష్యం పెరిగిపోతున్నందున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే జూన్ 2 నుండి ఎంఎంటిఎస్ రైళ్ళలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 

సిఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఇటీవల దక్షిణ మద్య రైల్వే స్టేషన్‌ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్‌ శ్రీవాత్సవతో సమావేశమై దీని గురించి చర్చించారు. 

ఎంఎంటిఎస్ రైళ్ళ ద్వారా ద.మ.రైల్వేకి ఏడాదికి సుమారు రూ.10 కోట్లు ఆదాయం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తం చెల్లించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. 

ఉచిత ప్రయాణ సౌకర్యంతో పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ మొత్తం చెల్లిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కనుక జూన్ 2 నుంచి ఏడాది పాటు ఎంఎంటిఎస్ రైళ్ళలో నగర ప్రజలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాల్సిందిగా వారు ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్‌ శ్రీవాత్సవని కోరారు. 

ఈ మేరకు పురపాలక అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ లిఖిత పూర్వకంగా ద.మ.రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐటివై పాండేని అభ్యర్ధించారు. ఆ లేఖలో అయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. 

ఎంఎంటిఎస్ ప్రయాణికుల కోసం వారి నివాస ప్రాంతాలకు సమీప రైల్వే స్టేషన్‌లకు మద్య ఆర్టీసీ షటిల్ సర్వీస్ బస్సులు నడిపిస్తుంది. కనుక స్టేషన్లో ఆ బస్సులు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి. 

ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. కనుక అందుకు తగ్గట్లుగా రద్దీ సమయాలలో ఎంఎంటిఎస్ సర్వీసులు పెంచాలి. అలాగే ప్రయాణికుల కోసం స్టేషన్లలో సౌకర్యాలు మెరుగు పరచాలి. ముఖ్యంగా ఎంఎంటిఎస్ సర్వీసులు సమయ పాలన పాటించాలి. 

దీనికి ఐటివై పాండే జవాబిస్తూ ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డు చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.


Related Post