జగిత్యాల సభ: బీఆర్ఎస్‌కి ప్రతిష్టాత్మకం, కీలకం కూడా!

April 18, 2026


img

ఈ నెల 20న జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్న జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగబోతున్న ఈ సభకి పూర్తి బాధ్యత తీసుకున్నారు. కనుక ఈ సభలోనే ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కనుక ఈ సభ విజయవంతం చేయడం ఆయనకు చాలా కీలకం. 

రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్‌, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సభకు హాజరు కాబోతున్నారు. కనుక ఈ సభకు లక్షల మందిని జనసమీకరణ చేసి అట్టహాసంగా నిర్వహించి విజయవంతం చేయాలని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు చాలా పట్టుదలగా ఉన్నారు. గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ నెల 25న కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని వార్తలు వచ్చాయి. కానీ ఆమె టిఆర్ఎస్‌ పార్టీ పేరుని  కేసీఆర్‌ వదిలేసుకున్నారు కనుక ఇప్పుడు ఆ పేరు ఫ్రీగా ఉంది ఎవరైనా వాడుకోవచ్చని చెప్పి బీఆర్ఎస్‌ పార్టీలో కలవరం సృష్టించారు. 

ఇంతకాలం ఆమె ఎన్ని విమర్శలు చేస్తున్నా స్పందించని కేటీఆర్‌, తొలిసారిగా “తల్లితండ్రులను బాధ పెట్టడం తగదు. మళ్ళీ పార్టీ పేరు మార్పుపై ఆలోచిస్తున్నామన్నారు.” 

సాధారణంగా ఏ పార్టీలోనైనా అధినేత సూచించినట్లే నాయకులు మాట్లాడుతుంటారు. కనుక కేసీఆర్‌ చెప్పమన్న మాటలే కేటీఆర్‌ చెప్పారని భావించవచ్చు. కనుక ఈ సభలో కేసీఆర్‌ కూతురి కొత్త పార్టీ, ఆమె రాజకీయ ఉద్దేశ్యాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. 

సరిగ్గా ఇదే సమయానికి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. అలాగే డీలిమిటేషన్‌ ప్రతిపాదన కూడా ఆగిపోయింది. 

కనుక ఈ సభలో కేసీఆర్‌ ప్రస్తావించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్ర రాజకీయాలు, బిజేపి-బీఆర్ఎస్‌ పార్టీ సంబంధాల గురించి కూడా ఈ సభలో కేసీఆర్‌ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఈ సభ బీఆర్ఎస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం, చాలా కీలకమైనదని భావించవచ్చు.


Related Post