రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ దొందూ దొందే: కవిత

April 21, 2026


img

నిన్న జరిగిన కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీ సభాలపై కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “75 ఏళ్ళ కురువృద్ధుడి (జీవన్ రెడ్డి)ని మరి కురువృద్ధుడు (కేసీఆర్‌) పార్టీలో చేర్చుకుని, ‘మీరే నవ యువకులు... మీరే తెలంగాణకు దిక్కని” ఒకరినొకరు పొగుడుకుంటుంటే, రాష్ట్రంలో యువత చచ్చిపోయారా? బ్రతికున్నారా? ఈ వృద్ధులే రాష్ట్రానికి దిక్కయితే మరి యువత పరిస్థితి ఏంటి? వారి ఫ్యూచర్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు,” అని తండ్రికి, జీవన్ రెడ్డికి చురకలు వేశారు. 

ప్రస్తుతం రాజకీయాలలో అందరి కంటే తక్కువ వయసున్న ఆమె నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక “ఎప్పటికీ మీరే రాజకీయాలు చేస్తామంటే మా పరిస్థితి ఏమిటి?” అని కవిత తండ్రిని సూటిగా ప్రశ్నించినట్లు భావించవచ్చు.

కాంగ్రెస్‌ సభ గురించి మాట్లాడుతూ, “గుంపు మేస్త్రి (సిఎం రేవంత్ రెడ్డి) గుంట నక్క (హరీష్‌ రావు) ఢిల్లీ ఎందుకు పోయాడు? అక్కడే ఆర్ఎస్ఎస్ పెద్దలలో ఎవరెవరిని, ఎందుకు కలిశారు? చెప్పాలన్నారు. మీరు చెప్తారా? లేక నన్ను చెప్పమంటారా? అంటూ డీల్ మాట్లాడుకుంటున్నట్లు మాట్లాడారు. 

ఇలాంటి మాటల కోసమేనా అంత పెద్ద సభ పెట్టింది? వీళ్ళకి ప్రజలు, వారి సమస్యలు పట్టవు. అందుకే సభలో ప్రజాసమస్యల గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. 

మళ్ళీ కేసీఆర్‌ తీరుని ఆక్షేపిస్తూ, “బీఆర్ఎస్‌ పార్టీ ఓటమికి మీరే (ప్రజలు) కారణమంటూ నిందించడం చూస్తే ఈ పార్టీ (కేసీఆర్‌) తీరు వెయ్యేళ్ళయినా మారదని అర్ధమవుతుంది. 

ప్రతిపక్షపార్టీ (కేసీఆర్‌)తీరు ఇలా ఉంటే, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తానని గుంపు మేస్త్రి అంటారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి మీరెవరు? నేటికీ బీఆర్ఎస్‌ పార్టీ (కేసీఆర్‌) అదే అహంకారంతో మాట్లాడుతుంటే, గుంపుమేస్త్రి కూడా నేనేమీ తక్కువ తినలేదన్నట్లు అహంకారంతో మాట్లాడుతున్నారు. 

ఇద్దరికీ ప్రజలంటే గౌరవం లేదు. ప్రజల తీర్పంటే అసలే గౌరవం లేదు. కానీ ఆ ప్రజలే తమని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టాలని కోరుకుంటారు,” అంటూ తండ్రి కేసీఆర్‌కి, సిఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత చురకలు వేశారు.  


Related Post