ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు నరకమే

April 23, 2026
img

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నేడు రెండో రోజున యధాతధంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌తో  సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి కాలం... ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 

ఇలాంటి సమయంలో సమ్మె వలన ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోవడంతో ప్రజలు ఉసూరుమంటూ షేరింగ్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. మహాలక్ష్మి పధకం వలన ఆదాయం కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నామని వాదిస్తున్న ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఇదే అదునుగా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. 

ఏదో ఒకరోజు బస్సులు లేకపోతే, అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తే భరించగలం కానీ ప్రతీరోజూ బస్సులలో ప్రయాణించే మధ్యతరగతి, నిరుపేదలు ఈ అదనపు భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా గ్యాస్ కొరత వలన్న టిఫిన్స్, భోజనాల, ఆహార పదార్ధాల ధరలు పెరిగిపోయినప్పుడు, ఈ భారం కూడా నెత్తిన మోయాలంటే సాధ్యమా? అని రోజువారి కూలీలు, మహిళలు, విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు.

అదే దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఏవిధంగా గమ్యస్థానాలు చేరుకోవాలో తెలీని పరిస్థితి నెలకొంది. అటు ఆర్టీసీ యాజమాన్యం-ఇటు కార్మికులు ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. కనుక ఇప్పట్లో సమ్మె ముగిసే సూచన కనిపించడం లేదు.                  


Related Post