ప్రముఖ తెలంగాణ జానపద గాయని మంగ్లీ-లాయర్ సుబ్బారావుకి మద్య జరుగుతున్న వివాదంలో మరో పరిణామం జరిగింది. లాయర్ సుబ్బారావు పిర్యాదులో నిందితుడుగా పేర్కొన్న రమావత్ మధుని గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, పటాన్ చెరుకి చెందిన వ్యాపారి కత్రిక సంతోష్, ఎల్బీ నగర్‌కు చెందిన బండి శివకుమార్, సంగారెడ్డికి చెందినా రమావత్ మధు, రమావత్ సక్రు కలిసి సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం దామరగిద్ద గ్రామంలో 16 ఎకరాలలో శుబక్షేత్ర వెంచర్ వేశామంటూ మియాపూర్‌లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు.
రూ.5 లక్షలు చెల్లిస్తే తమ వెంచర్‌లో 102 చ.గజాల స్థలం, రూ.5 లక్షలకు భీమా ఇస్తామని, మళ్ళీ 42 నెలల పాటు నెలకు రూ.25,000 చొప్పున చెల్లిస్తామని మాయమాటలు చెపుతూ 31 మంది నుంచి రూ.6.58 కోట్లు వసూలు చేశారు. కానీ ఎవరికీ స్థలం రిజిస్టర్ చేయలేదు. నెల నెలా ఇస్తామన్న రూ.25,000 కూడా ఇవ్వలేదు. దీంతో బాధితులు మియాపూర్ వద్ద వారి కార్యాలయానికి వెళ్ళి నిలదీస్తే బౌన్సర్లని పెట్టి తరిమేసేవారు.
అప్పుడు వారందరూ లాయర్ సుబ్బారావు ద్వారా ఈ న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసులోనే గాయని మంగ్లీ కూడా వారితో చేతులు కలిపారని, తాను బాధితుల తరపున పోరాటం చేస్తుంటే తనపై ఎదురుదాడి చేస్తున్నారని లాయర్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన రమావత్ మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. కనుక నిజానిజాలు వాటితో పాటు మంగ్లీ ప్రమేయం ఉందో లేదో బయటపడుతుంది. ఒకవేళ సుబ్బారావు ఆరోపిస్తున్నట్లు ఈ డబ్బు వసూళ్ళలో ఆమె ప్రమేయం ఉన్నట్లయితే ఆమెకూ ఇబ్బందులు తప్పవు.