రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కాంతారకు సీక్వెల్‌గా తీస్తున్న కాంతార చాప్టర్-1 షూటింగ్ కర్ణాటకలో మాణి జలాశయం వద్ద జరుగుతోంది. శనివారం రిషబ్ శెట్టితో సహా 30 మంది ఓ బోట్‌లో జలాశయంలోకి వెళ్ళి షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు బోట్ తిరగబడి అందరూ నీళ్ళలో మునిగిపోయారని, కానీ అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారని శనివారం సాయంత్రం వార్తలు వచ్చాయి. వాటిపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ స్పందిస్తూ, “అవన్నీ ఒట్టి పుకార్లే. షూటింగ్‌లో ఎటువంటి బోటు ప్రమాదం జరుగలేదు. ఒకవేళ జరిగినా లైఫ్ జాకెట్స్, పక్కనే మరో రెండు మూడు బోట్లు, కాపాడేందుకు గజ ఈతగాళ్ళు అందరూ సిద్దంగా ఉన్నారు. నిన్న ఈ ప్రాంతంలో విపరీతంగా గాలి వీయడంతో ఒడ్డున వేసిన సెట్ ఎగిరిపోయింది. ఆ సమయంలో దానిలో ఎవరూ లేరు. కనుక ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరుగలేదు. కనుక షూటింగ్‌లో ప్రమాదం జరిగిందనే వార్తలు నమ్మవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో 2022లో ఎటువంటి అంచనాలు లేకుండా కాంతార విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నిర్మాతలకు కనకవర్షం, రిషబ్ శెట్టికి మంచి పేరు ప్రతిష్టలు, అనేక అవార్డులు తెచ్చిపెట్టింది. దానికి సీక్వెల్‌గా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కాంతార చాప్టర్-1 తీస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కాబోతోంది.