అల్లు అర్జున్‌: నాడు వివాదం నేడు పురస్కారం

June 15, 2025


img

గత ఏడాది డిసెంబర్‌ 4న పుష్ప-2 సినిమా హైదరాబాద్‌, సంధ్య థియేటర్‌లో విడుదలైనప్పుడు, ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే.

నాడు అల్లు అర్జున్‌ కారణంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మద్య దూరం పెరిగింది. కానీ కానీ శనివారం సాయంత్రం హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్‌కి గద్దర్ అవార్డ్ ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సినీ పరిశ్రమ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పటికీ, సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు ఈ అవార్డుల ప్రధానోత్సవమే ప్రత్యక్ష నిదర్శనం. తెలంగాణలో వివిద రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. 

సినీ పరిశ్రమలో ఆనాడు ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌లు, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, వారి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, ఇప్పుడు తర్వాత తరం పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు.. ఇలా తరతరాలుగా సినీ పరిశ్రమలో పలువురు రాణించారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌, నిర్మాత బన్నీ, అశ్వనీదత్ కుమార్తెలు యువతరం కూడా సినీ పరిశ్రమలో రాణిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. 

హాలీవుడ్, బాలీవుడ్ కూడా హైదరాబాద్‌ వచ్చి సినిమాలు తీసేంత గొప్పగా ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు ప్రభుత్వం తరపు నుంచి సినీ పరిశ్రమకు ఎటువంటి సహకారం కావాలన్నా అందించడానికి మేము సిద్దంగా ఉన్నాము.

గద్దర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆనాడే చెప్పాను. నేటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. అటువంటి గొప్ప కళాకారుడు, ప్రజల మనిషి పేరుతో ఈ సినీ అవార్డులు ఇచ్చుకోవడం మన అందరికీ గర్వకారణమే,” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమలో అవార్డులు అందుకున్నవారితో పాటు అల్లు అరవింద్, అశ్వనీ దత్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ఆర్‌. నారాయణ మూర్తి, జయసుధ, జయప్రద, సుహాసినీ తదితర పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ఎండీ హరీష్, నిర్మాత దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు. 


Related Post

సినిమా స‌మీక్ష