నయనతార వ్యక్తిగత, సినీ జీవితాన్ని వివరిస్తూ, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘బియాండ్ ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందించి తమ ఓటీటీలో ప్రసారం చేసింది. దానిపై కోలీవుడ్ నటుడు ధనుష్ అభ్యంతరం చెపుతూ నయనతార దంపతులపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.
తన అనుమతి ఇవ్వకపోయినా, తాను అభ్యంతరం చెపుతున్నప్పటికీ ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా నుంచి 3 సెకన్లు నిడివి గల వీడియో క్లిప్ ఆ డాక్యుమెంటరీలో వాడుకునందుకు ధనుష్ వారిపై కేసు వేశారు. ఈ నెల 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు వారికి గడువు ఇచ్చింది.
ఈ కేసు ఇంకా సాగుతుండగానే, నయనతార నటించిన సూపర్ డూపర్ హిట్ ‘చంద్రముఖి’ సినిమా క్లిప్పింగ్ ఆ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా వాడుకున్నందుకు సదారి సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ నయనతార దంపతులకు లీగల్ నోటీస్ ఇచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి.
వాటిపై ఆ సంస్థ స్పందిస్తూ అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపడేసింది. ఆ సినిమాలో వీడియో క్లిప్పింగ్ వాడుకునేందుకు నయనతార దంపతులు ముందుగానే తమ అనుమతి తీసుకున్నారని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ వారికి అప్పుడే ఓ లేఖ కూడా వ్రాశామని శివాజీ ప్రొడక్షన్స్ తెలియజేస్తూ, ఆ లేఖ కాపీని కూడా సోషల్ మీడియాలో పెట్టింది.